హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికకు బహుజన్ సమాజ్ పార్టీ(BSP) తమ అభ్యర్థిని ఖరారు చేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి.. తండ్రి రాములును ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున బరిలోకి దించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అనుమతి ఇచ్చినట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
నిన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని తెరాస అభ్యర్థిగా ప్రకటించింది. . మునుగోడు టికెట్ కోసం పార్టీలోని సీనియర్ నేతలు ప్రయత్నించగా.. సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీ అధిష్ఠానం కూసుకుంట్లవైపు మొగ్గు చూపింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించగా.. ఇవాళ భాజపా అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి 6న ఓట్ల లెక్కింపు జరగనుంది.