contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే పులివర్తి నాని

పాకాల (తిరుపతి జిల్లా) : “రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. రాష్ట్రం బాగుంటే ఎమ్మెల్యేగా నేను కూడా బాగుంటాను” అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం సామిరెడ్డిపల్లి పంచాయతీలో ఘనంగా నిర్వహించిన ‘ఏరువాక పౌర్ణమి’ మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, మహిళలు, యువత ఆయనకు ఘనస్వాగతం పలికారు.

అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ మామిడి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిలోకు రూ.4 చొప్పున రూ.180 కోట్ల సాయాన్ని మంజూరు చేశారని గుర్తు చేశారు. దీని ద్వారా చంద్రగిరి నియోజకవర్గంలోని సుమారు 26 వేల మంది మామిడి రైతులకు రూ.17 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని చెప్పారు.

నియోజకవర్గంలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పదిపట్ల బైలు నుంచి కల్యాణి డ్యామ్, కొటాల చెరువుకు నీటిని తరలించే ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే రామసముద్రం చెరువుకు కూడా సాగునీరు అందించేలా నిధుల అంచనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. చెరువుల అనుసంధానంతో భూగర్భ జలమట్టం పెరిగి రైతులు ఏడాది పొడవునా వ్యవసాయం చేసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు.

చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. ముద్దలపల్లిలో జరిగిన ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులను జూమ్ సమావేశాల పేరుతో మానసికంగా వేధించారని, ప్రస్తుతం అధికారులు స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని అన్నారు.

ఎక్కడైనా ప్రజలకు సమస్యలు ఎదురైతే కూటమి నాయకులు, కార్యకర్తలు వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, మహిళలు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :