contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Kakinada : వణికిస్తున్న వీధికుక్కల బెడద – పట్టించుకోని అధికారులు

కాకినాడ: వీధికుక్కల సమస్య ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని, ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను స్థానిక సంస్థలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమార్హం కాదని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు విమర్శించారు. వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట “కామన్ మ్యాన్ ప్రొటెక్షన్” పేరుతో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీధికుక్కల సమస్యను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించి, వాటి నియంత్రణ కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ కాకినాడ నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు వాటి అమలుపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి ఏడాది సుమారు రెండు కోట్ల మంది కుక్కకాటుకు గురవుతుండగా, దాదాపు 25 వేల మంది రేబిస్ వ్యాధితో మరణిస్తున్నారని, అందులో 50 నుంచి 60 శాతం వరకు 15 సంవత్సరాల లోపు చిన్నారులేనని తెలిపారు. వీధికుక్కల సమస్యను చిన్న అంశంగా కాకుండా ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యంత కీలక సమస్యగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి, సుప్రీంకోర్టు సూచనల మేరకు వీధికుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయవచ్చని సూచించారు. పారిశ్రామిక సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను ఇందుకు వినియోగించే అవకాశం ఉందని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటే ఈ ప్రక్రియ సులభమవుతుందని పేర్కొన్నారు.

ఇటీవల సాంబమూర్తి నగర్‌లో ఒక పిచ్చికుక్క చిన్నారులతో పాటు పలువురిపై దాడి చేసిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇది రేబిస్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోందని అన్నారు. 2018లో ఫ్రేజర్‌పేట బాలాజీ చెరువు సెంటర్ సమీపంలో ఆరేళ్ల బాలుడు నాగేంద్రను వీధికుక్కలు దాడి చేసి చంపిన ఘటనను గుర్తు చేస్తూ, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఏటా ఐదు వేలకుపైగా కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా తొమ్మిది వేలకుపైగానే ఉందన్నారు. 2025-26లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 86 వేల యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ ఇంజెక్షన్లు వినియోగించడం సమస్య తీవ్రతకు నిదర్శనమని చెప్పారు. ఒక్క కాకినాడ నగరంలోనే 28 వేలకుపైగా వీధికుక్కలు ఉన్నాయని, అయితే గత ఏడాది కేవలం 12 వేల కుక్కలకు మాత్రమే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, రేబిస్ టీకాలు వేశారని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం కార్పొరేషన్ బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించి వీధికుక్కలకు షెల్టర్లు, ఆహారం, తాగునీటి సదుపాయం కల్పించాలని, అదే సమయంలో జనాభా నియంత్రణ, రేబిస్ టీకాల కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని రమణరాజు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :