పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని : గోదావరిఖని పట్టణానికి చెందిన కరాటే విద్యార్థులు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుని జిల్లా ఖ్యాతిని చాటారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి వారి ప్రతిభను కొనియాడారు.
ఈ ఏడాది ఏప్రిల్ 26న హైదరాబాద్లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కరాటే ప్రదర్శన లో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సుమారు 2,900 మంది విద్యార్థులు, సీనియర్ కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. ఇందులో 1,212 మంది విద్యార్థులు తమ ప్రదర్శనతో గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు.
ఈ ఘనత సాధించిన వారిలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జపాన్ షిటో ర్యూ కరాటే స్కూల్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ సంస్థకు చెందిన 25 మంది విద్యార్థులు గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడంతో వారిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, కరాటే అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, జీవితంలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, మానసిక ధైర్యం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే గొప్ప మార్షల్ ఆర్ట్ అని అన్నారు. ముఖ్యంగా బాలికలు స్వీయ రక్షణ కోసం కరాటేను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జపాన్ షిటో ర్యూ కరాటే స్కూల్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ అండ్ బెల్ట్ ఎగ్జామినర్ కరాటే శ్రీనివాస్ పాల్గొనడం సంస్థకు గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. ఆయన శిక్షణలో విద్యార్థులు గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల జపాన్ షిటో ర్యూ కరాటే స్కూల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమేష్, సీనియర్ ఇన్స్ట్రక్టర్లు ఎస్. శ్రీనివాస్, శ్రావణ్ పటేల్, సంజన, అభిజ్ఞ, ఎన్టీపీసీ స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్రీరామ్, కార్యదర్శి నరేంద్ర సోనీ, చిరంజీవి తదితరులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
గోదావరిఖని విద్యార్థులు సాధించిన ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డు స్థానికంగా ఆనందోత్సాహాలను నింపగా, జిల్లా క్రీడా రంగానికి ఇది మరో గర్వకారణంగా నిలిచింది.








