contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రభుత్వ స్కూల్ ముద్దు – ప్రైవేట్ స్కూల్ వద్దు

  • ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రుల సహకారం అవసరం
  • మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లిఖార్జునరావు

 

పల్నాడు జిల్లా – మాచర్ల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు తల్లిదండ్రులు కూడా తమ వంతు సహకారం అందించాలని మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లిఖార్జునరావు కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు.

మాచర్ల పట్టణంలోని నెహ్రూనగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్‌కు యాగంటి మల్లిఖార్జునరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకును ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం అభినందించింది.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతకంతో ప్రభుత్వం తరఫున అందించిన ప్రశంసాపత్రాన్ని పాఠశాల హెచ్‌ఎం కేశవరెడ్డి, ఉపాధ్యాయులు ఏడుకొండలు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి యాగంటి మల్లిఖార్జునరావుకు అందజేశారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా యాగంటి మాట్లాడుతూ.. సమాజంలో పేదరిక నిర్మూలనతో పాటు అభివృద్ధికి విద్యే ప్రధాన మార్గమని అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రభుత్వాలు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, షూ, సాక్సులతో పాటు మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని యాగంటి పేర్కొన్నారు.

అర్హత కలిగిన ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో విద్యాబోధనపై దృష్టి సారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఇతర విధులను తొలగించి, వారిని విద్యాబోధనకే పరిమితం చేయడం వల్ల విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందే అవకాశం ఉంటుందని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, విద్యా విధానాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతోందని యాగంటి తెలిపారు. గతంతో పోలిస్తే సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు ఆయన పేర్కొన్నారు.

పాఠశాలల్లో చిన్నచిన్న మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిసారీ ప్రభుత్వంపైనే ఆధారపడకుండా తల్లిదండ్రులు కూడా తమ వంతు సహకారం అందించాలని యాగంటి మల్లిఖార్జునరావు సూచించారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందితే భవిష్యత్తులో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. సాఫ్ట్‌వేర్, ఉక్కు, సిమెంట్ తదితర రంగాల అభివృద్ధితో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని యాగంటి మల్లిఖార్జునరావు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :