contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు : జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి

పార్వతీపురం : జిల్లాలోని రైతులకు ఎరువుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే డీలర్లు, విక్రయదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులపై రూపాయి కూడా అదనపు భారం పడకూడదని ఆయన స్పష్టంగా తెలిపారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎరువుల కంపెనీల ప్రతినిధులు, హోల్‌సేల్ డీలర్లు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైల్వే రేక్ పాయింట్ల ద్వారా జిల్లాకు వచ్చే ఎరువుల సమాచారాన్ని కనీసం నాలుగు రోజుల ముందుగానే అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.

స్టాక్ పాయింట్ల నుండి రిటైలర్లకు వెళ్లే ప్రతి బస్తా వివరాలు అధికారుల వద్ద నమోదు కావాలని, శాఖాపరమైన తనిఖీలు పూర్తయ్యే వరకు విక్రయాలు ప్రారంభించకూడదని సూచించారు. ఎరువుల కొనుగోలు సమయంలో రైతులకు అవసరం లేని ఇతర ఉత్పత్తులను బలవంతంగా విక్రయించడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడే డీలర్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని హెచ్చరించారు.

రవాణా ఛార్జీల పేరుతో అదనపు వసూళ్లు చేస్తే సహించబోమని స్పష్టం చేస్తూ, కంపెనీలు ఇచ్చే రిబేట్లు రవాణా ఖర్చులకు సరిపోవాలని పేర్కొన్నారు. రైతుపై ఎటువంటి అదనపు భారం మోపకూడదని ఆదేశించారు.

జిల్లాలో ఎరువుల కొరత లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కోటాలో 100 శాతం పారదర్శకంగా పంపిణీ జరగాలని, ఎక్కడా నల్లబజారుకు అవకాశం ఉండకూడదని పేర్కొన్నారు. ఎవరైనా డీలర్లు అధిక ధరలకు విక్రయించినా లేదా ఇతర ఉత్పత్తులను బలవంతంగా విక్రయించినా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు. ఫిర్యాదులు అందిన పక్షంలో విచారణ జరిపి కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణహితమైన నానో యూరియా, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం కింద నానో యూరియా వినియోగాన్ని విస్తరించాలని తెలిపారు.

ఎరువుల నిల్వలు, పంపిణీపై జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, డీలర్లు స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, అడ్వాన్స్ సేల్స్‌కు పాల్పడకూడదని ఆదేశించారు. రైతులకు లేదా అధికారులకు ఎరువుల పంపిణీపై సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఆర్. అన్నపూర్ణతో పాటు ఎరువుల కంపెనీల ప్రతినిధులు, హోల్‌సేల్ డీలర్లు, మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :