తిరుపతి జిల్లా, పాకాల, ఏప్రిల్ 22: ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా గ్రామాల పరిస్థితులు మాత్రం మారడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకాల మండలంలోని ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని అగ్రహారం, ఉప్పరపల్లి గ్రామాలు గత ఆరు నెలలుగా ప్రాథమిక సదుపాయాల లేమితో అంధకారంలో మగ్గుతున్నాయి.
అంధకారంలో రహదారులు.. పెరుగుతున్న ప్రమాదాలు
పాకాల రైల్వే అండర్ బ్రిడ్జి నుండి అగ్రహారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా చీకటిలో మునిగిపోయింది. వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషసర్పాలు, తేళ్లు సంచరిస్తుండటంతో ప్రాణ భయం నెలకొంది. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా అధికారుల నుండి స్పందన రాకపోవడం గ్రామస్తులను నిరాశకు గురిచేస్తోంది.
స్మశాన స్థలం లేక అవస్థలు
గ్రామాల్లో స్మశాన వాటిక లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. దశాబ్దాలుగా స్థలం కేటాయించాలని కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో అంతిమ సంస్కారాల నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతోందని వారు చెబుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
“పన్నులు వసూలు చేయడంలో చూపే శ్రద్ధ, కనీస సదుపాయాల కల్పనలో కనిపించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీధి దీపాలను పునరుద్ధరించడంతో పాటు స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం,” అని గ్రామస్తులు హెచ్చరించారు.
గ్రామాల్లో నెలకొన్న ఈ సమస్యలపై ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








