పార్వతీపురం : జిల్లాలో ఎన్నికల రోల్స్ మ్యాపింగ్, ఫారమ్‌ల పరిశీలన ప్రక్రియ పక్కాగా కొనసాగుతోందని జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత తెలిపారు. శనివారం ఆమె ఛాంబరులో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా సాగేందుకు రాజకీయ పార్టీలతో సమన్వయం అత్యంత కీలకమని అన్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన 2002 ఎన్నికల రోల్ డేటాను 2025 డేటాతో బూత్ లెవల్ అధికారి (BLO) యాప్‌లో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోందని వివరించారు. ఇప్పటివరకు 68.53 శాతం మ్యాపింగ్ పూర్తయినట్లు తెలిపారు.
గతేడాది జనవరి 6 నుంచి ఇప్పటివరకు మొత్తం 16,799 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో 273 మాత్రమే వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కొత్త ఓటర్ల నమోదు కోసం వచ్చిన ఫారం-6 దరఖాస్తులు 7,437 కాగా, అందులో 6,358 మందిని ఓటర్లుగా చేర్చామని, 135 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఓట్ల తొలగింపుకు సంబంధించిన ఫారం-7 దరఖాస్తులు 2,316 రాగా, అందులో 2,046 తొలగింపులు పూర్తి చేశామని చెప్పారు. కేవలం 4 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉండగా, మిగిలినవి సరైన ప్రమాణాలు లేక తిరస్కరించబడినట్లు తెలిపారు.
పేరు, చిరునామా లేదా ఫోటో మార్పుల కోసం వచ్చిన ఫారం-8 దరఖాస్తులు 7,436 కాగా, అందులో 6,934 సవరణలు పూర్తయ్యాయని, 368 దరఖాస్తులు తగిన ధృవపత్రాలు లేక తిరస్కరించబడ్డాయని, 134 పరిశీలనలో ఉన్నాయని వివరించారు.
ఎన్నికల రోల్స్ సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు చురుకుగా పాల్గొని లోపాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని డిఆర్ఓ సూచించారు. ఓటర్ల జాబితాల ఖచ్చితత్వం కోసం పార్టీల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ ప్రతినిధులు సి. బాలాజిరావు, అల్లూరి పేర్రాజు, బి. నాగభూషణం, ఎస్.వి. మహేష్, వైసీపీ ప్రతినిధి వి. శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన బి. దిలీప్ కుమార్, ఎస్. శ్రీనివాసరావు, బీఎస్పీ ప్రతినిధి టి.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.








