జియ్యమ్మవలస: పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మ వలస గిరిజన గ్రామాలైన అర్నాడ, థాక్షిణి , రాజయ్యపేట ప్రాంతాలకు తక్షణమే రహదారులను మంజూరు చేయాలని కురుపాం మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకులు నిమ్మక జయరాజ్ కోరారు. శనివారం జియ్యమ్మవలస మండలంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిమ్మక జయరాజ్ మాట్లాడుతూ. సదరు గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించాలంటూ గతంలోనే పలుమార్లు గ్రీవెన్స్‌లో వినతులు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రజా దర్బార్ వేదికగా ఈ సమస్యను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి, స్థానిక కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు & ప్రభుత్వ విప్, తోయక జగదీశ్వరిల దృష్టికి మరోసారి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రహదారులు ఎంతో కీలకం. ఈ సమస్యపై స్పందించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రోడ్ల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.








