- చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తున్న డోన్ సీఐ మల్లిఖార్జున
- బాధితులపై దురుసుగా ప్రవర్తిస్తున్న డోన్ సి.ఐ ను సస్పెండ్ చేయాలి
- యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక డిమాండ్
చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తూ అవినీతికి పాల్పడుతున్న డోన్ పట్టణ సి.ఐ మల్లిఖార్జున ను విధుల నుండి తప్పించకుండా నంద్యాల జిల్లా S.P , రాయలసీమ రేంజ్ డీ.ఐ.జి చోద్యం చూస్తూ సి.ఐ కి కొమ్ము కాస్తున్నారని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి సమావేశంలో మాట్లాడారు. డోన్ పట్టణ సి.ఐ మల్లిఖార్జున పోలీసు ఉద్యోగానికి అనర్హుడని, ప్రజల పట్ల సామరస్యంగా ప్రవర్తించకుండా,గట్టి గట్టిగా అరుస్తూ ” రా చూసుకుందాం” అని స్టేషనుకు వచ్చే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ వుంటే వీటన్నింటిని చూస్తూ ఉన్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సదరు సి.ఐ పై చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి అని అన్నారు. భార్యాభర్తల మధ్య చిన్న పాటి సమస్యలు వచ్చినప్పుడు వారి ఫిర్యాదు పట్ల కౌన్సిలింగ్ చేయకుండా తనకు ఇష్టం వచ్చినట్లు ఫిర్యాదు వ్రాయించి బాధితురాలి చేత సంతకం చేయించుకుని తప్పుడు కేసులు నమోదు చేసి, అన్యాయానికి పాల్పడిన భర్తకు మద్దతు ఇస్తూ, బాధితురాలైనా మహిళను తన ముగ్గురు ఆడపిల్లలను రోడ్డున పడేసిన సి.ఐ చర్యల పట్ల జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ మౌనంగా ఉండడంలో మతలబు ఏమిటి..? అని ఆమె ప్రశ్నించారు. అదే విధంగా బేడ బుడగ జంగాల కులంలో ఉన్న డబ్బు కట్టడి పద్ధతి పంచాయతీలు పోవాలని మరియు బాల్య వివాహాలు జరగకుండా చూడాలని మహిళా సంఘాలు అంతా కలిసి జిల్లా కలెక్టర్లకు, పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇస్తూ పోరాడుతుంటే మరో ప్రక్క డోన్ సి.ఐ మల్లిఖార్జున లంచాలకు పాల్పడుతూ బాల్య వివాహాలను ప్రోత్సహిస్తూ, లక్షల రూపాయలు కట్టడి కట్టి టెంట్లు వేసుకుని కుల పెద్దలు పంచాయతీలు చేస్తుంటే అక్కడ గొడవలు జరిగి బాధితులకు తలలు పగిలి నెత్తురు చిందినా పట్టించుకోని డోన్ సి.ఐ మల్లిఖార్జున అవినీతి బాగోతం కానీ, చట్ట వ్యతిరేక చర్యలు కానీ జిల్లా ఉన్నతాధికారులకు కనపడవా.. వినబడువా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇలాఖాలో బుడగజంగాల వారు బాల్య వివాహాలు, లక్షల రూపాయల డబ్బు కట్టడి పంచాయితీలు చేసుకుంటున్నారని, మరియు మంత్రి గారి ఆశీస్సులతో డోన్ సి.ఐ సహకారంతో “మూడు బాల్య వివాహాలు, ఆరు డబ్బు కట్టడి పంచాయితీలు” చేసుకుంటూ కులపెద్దలు వ్యవహరిస్తుంటే డోన్ పోలీసు అధికారులు చోద్యం చూస్తూ వున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.అదే విధంగా ఏకంగా బాల్యవివాహలకు అధికార పార్టీ నాయకులు డోన్ ఎం.పి.పీ, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దగ్గరుండి అక్షింతలు వేసి పెళ్ళిళ్ళు జరిపించడం చూస్తే ఆర్థిక మంత్రి.గారికి తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయా.. అందుకే పోలీస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అని ఆమె అన్నారు. ఇప్పటికైనా వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని తప్పులు చేసిన కుల పెద్దలపై చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడిన డోన్ సి.ఐ మల్లిఖార్జున ను వెంటనే సస్పెండ్ చేయాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధిత మహిళలకు న్యాయం చేయాలని, ప్రజలకు చట్టంపై నమ్మకాన్ని కలిగేలా చూడాలని నంద్యాల జిల్లా యస్.పి.గారిని కోరారు. ఈ సమావేశంలో యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ , సంచార జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రాక్షల ఇందిరమ్మ , బేడ బుడగ జంగం మహిళా సంఘం నాయకురాలు శిరిగిరి లక్ష్మీ , నాగమ్మ , ఈబూతి సాలేశ్వరి, ఈబూతి పుల్లమ్మ , ఈబూతి ఎల్లమ్మ , ఈబూతి అంజనమ్మ , ఈబూతి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.