టీ20 ప్రపంచ కప్ గ్రూప్–బి తొలి మ్యాచ్ లో రెండుసార్లు ప్రపంచ విజేత వెస్టిండీస్ కు షాకిచ్చిన స్కాట్లాండ్ పై ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. గ్రూప్–బిలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 175/5 స్కోరు చేసింది. ఓపెనర్ మైఖేల్ జోన్స్ (55 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 86) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రికీ బెరింగ్టన్ (37), మాథ్యూ క్రాస్ (28) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ క్యాంఫర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 19 ఓవర్లలోనే 180/4 స్కోరు చేసి విజయం సాధించింది. కర్టిస్ కాంఫర్ (32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 నాటౌట్) ఐర్లాండ్ కు విజయం కట్టబెట్టాడు. జార్జ్ డాక్ రెల్ (39 నాటౌట్) కూడా రాణించాడు. తొలి పోరులో జింబాబ్వే చేతిలో ఓడినప్పటికీ ఈ గెలుపుతో ఐర్లాండ్ సూపర్12 రేసులోకి వచ్చింది.