contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

లా అండ్ ఆర్డర్ పై శ్వేతపత్రం విడుదల చేసిన సియం చంద్రబాబు

సీఎం చంద్రబాబు వివిధ శాఖలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ శాంతిభద్రతల అంశంపై ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు శ్వేతపత్రంలోని అంశాలను సభకు వివరించారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీనే కారణమని స్పష్టం చేశారు.

టీడీపీ హయాంలో గతంలో హైదరాబాదులో మత కల్లోలాలను ఉక్కుపాదంతో అణచివేశామని చెప్పారు. గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లు ఏర్పాటు చేశామని, హైదరాబాదులో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు కృషి చేశామని, తద్వారా హైదరాబాదులో పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థలు రావడానికి మార్గం సుగమం అయిందని చంద్రబాబు వివరించారు.

ఇక, రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు మానసికంగా, శారీరకంగా మనోవేదన అనుభవించారని… పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపైనే దాడులు జరిగిన పరిస్థితి చూశామని అన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారని వ్యాఖ్యానించారు. పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని, నిబంధనలు ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్ల పాటు వీఆర్ లోనే ఉన్న అధికారులు కూడా ఉన్నారంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

గతంలో తనపై బాబ్లీ కేసు ఒక్కటే ఉండేదని, వైసీపీ వచ్చాక తనపై 17 కేసులు పెట్టారని వెల్లడించారు. పవన్ కల్యాణ్ పై 7 కేసులు పెట్టారని తెలిపారు. అందరికంటే ఎక్కువగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై 60కి పైగా కేసులు పెట్టారని, ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు ప్రయత్నించారని వివరించారు.

“సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయని ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. పులివెందులలో పోటీ చేసిన బీటెక్ రవిని జైల్లో పెట్టారు. అధికారులపై దాడి చేశారని కూన రవికుమార్ పై కేసులు నమోదు చేశారు. ఫర్నిచర్ దుర్వినియోగం చేశారని కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టారంటే వాళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అర్థమవుతుంది. దాంతో, తీవ్ర అవమానంగా భావించిన కోడెల ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన అందరికీ తెలుసు. గత ముఖ్యమంత్రి ఇంట్లో ఇప్పటికీ ప్రభుత్వం ఫర్నిచర్ లేదా?

ఇక, వంగలపూడి అనితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు… అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అత్యాచారయత్నం కేసు కూడా పెట్టారు. ఆరోగ్యం బాగాలేని అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుని 600 కిలోమీటర్లు వాహనంలో తిప్పారు. ప్రశ్నాపత్రం లీకైందని నారాయణపై కేసు నమోదు చేశారు.

రఘురామకృష్ణరాజును లాకప్ లో పెట్టి దారుణంగా చిత్రహింసలపాల్జేశారు. రఘురామను చిత్రహింసలు పెడుతుంటే ఆ వీడియో చూసి అప్పటి ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందడాన్ని ఏమనాలి? రఘురామకు ఐదేళ్ల పాటు సొంత నియోజకవర్గంలోనే భద్రత లేని పరిస్థితి కల్పించారు.

జై జగన్ అనలేదని పల్నాడులో టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్యను ఘోరంగా చంపేశారు. సీపీఎస్ కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపడితే వారిపై కేసులు పెట్టారు. ఆఖరికి జర్నలిస్టులపై కూడా కేసులు పెట్టారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి జగన్ ఇంటికి వెళ్లిన ఆరుద్ర అనే మహిళను చిత్రహింసలకు గురిచేశారు. దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో 300 మంది బీసీలను బలిగొన్నారు.

తన ఇంటి సమీపంలోనే మహిళపై సామూహిక అత్యాచారం జరిగితే జగన్ స్పందించలేదు. నంద్యాలలో ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాంపై దొంగతనం నింద మోపి అతడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడానికి కారకులయ్యారు. గత ప్రభుత్వ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగాయి. అంతర్వేదిలో రథాన్ని కూడా తగలబెట్టారు.

నాటి జగన్ ప్రభుత్వం అమరావతి రైతులను, మహిళలను కనీసం మనుషులుగా కూడా చూడలేదు. కేసులు, అరెస్ట్ లే కాదు, కనీసం తిండి కూడా తిననివ్వకుండా చేసిన చరిత్ర నాటి ప్రభుత్వానిది.

వివేకా హత్య జరిగితే… మొదట గుండెపోటు అని, ఆ తర్వాత హత్య అన్నారు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ వెళితే అడ్డుకున్నారు. నాలుగు దశాబ్దాల నా రాజకీయ చరిత్రలో జగన్ వంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. టాటా, రిలయన్స్ అధినేతల కంటే ఎక్కువ సంపాదించాలని జగన్ కోరుకుంటున్నాడు. జగన్ వంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు. అలాంటి వైసీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు.

ఇప్పుడు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం… తప్పుడు రాజకీయాలు చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఎట్టి పరిస్థితిల్లోనూ సహించేది లేదు. గతంలో 24 క్లేమోర్ మైన్స్ పేల్చి నన్ను అంతమొందించేందుకు ప్రయత్నించారు.

అసెంబ్లీలో నాకు జరిగిన అన్యాయానికి కన్నీళ్లు పెట్టుకున్నాను. గత ప్రభుత్వ పాలనలో నాకు ప్రాణసమానులైన కార్యకర్తలను కోల్పోయాను. మనకు అధికారం ఇచ్చింది కక్ష సాధింపులకు కాదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తాం.

రాజకీయ ప్రేరణలతో పెట్టిన కేసులను సమీక్షిస్తాం… అక్రమ కేసులు పెట్టిన అధికారులను కూడా శిక్షిస్తాం. అక్రమ కేసుల సమీక్ష కోసం ప్రత్యేక కమిషన్ వేసేందుకు ఆలోచిస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్టు శాంతిభద్రతలపై లోతైన చర్చ జరపాల్సిన అవసరం ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక చర్చ చేపడతాం.

లా అండ్ ఆర్డర్ విషయంలో ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలపడమే మా ధ్యేయం. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులు పెట్టడంపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలపై అసభ్య పోస్టులు పెట్టేవారిలో ఎన్డీయే కూటమి సభ్యులు ఉన్నా ఉపేక్షించను” అంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :