మెదక్ జిల్లా- తూప్రాన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించిన సీఐ రంగాకృష్ణ బదిలీపై ఇతర ప్రాంతానికి వెళ్లగా, ఆయన స్థానంలో వెంకట్రాజ్ గౌడ్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రంగాకృష్ణ నూతన సీఐ వెంకట్రాజ్ గౌడ్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాట్లాడిన రంగాకృష్ణ, తన రెండేళ్ల పదవీకాలంలో ఎల్లప్పుడూ సహకారం అందించిన తూప్రాన్ ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతు, పోలీసు సిబ్బంది సమిష్టి కృషితోనే తూప్రాన్ పరిధిలో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించగలిగానని పేర్కొన్నారు. ప్రజల ప్రేమ, ఆదరణ ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని భావోద్వేగంగా అన్నారు.
ఈ సందర్భంగా తూప్రాన్ పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు రంగాకృష్ణ సేవలను కొనియాడారు. ఆయన పదవీకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. నేరాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారం, పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాల పెంపులో విశేష కృషి చేశారని అభినందించారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్రాజ్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలకు సత్వర సేవలు అందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.








