అనంతపురం జిల్లా : గుత్తి పట్టణంలో మట్కా నిర్వహిస్తూ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 34 మట్కా చీటీలు, 3 బాల్ పెన్నులు, 1,100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజలకు డబ్బుల ఆశ చూపిస్తూ మట్కా ఆడిస్తూ, గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు గుత్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. రామారావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం గుత్తి–అనంతపురం రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయినవారిలో గుత్తి పట్టణానికి చెందిన మాతంగి రాము (44), మునగల కంబగిరి (39), నగదాని శివ (38) ఉన్నారు. వీరిపై గుత్తి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 104/2026 కింద NDPS చట్టం మరియు ఏపీ గేమింగ్ (మట్కా) చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాలు, గుంతకల్లు ఎస్డీపీఓ ఏ. శ్రీనివాస్ పర్యవేక్షణలో గుత్తి సీఐ ఎం. రామారావు, ఎస్ఐ కె. సురేష్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారుల సంయుక్త బృందం ఈ దాడులు నిర్వహించింది.
ఈ కేసులో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.








