మెదక్ జిల్లా – మాసాయిపేట, తూప్రాన్ : మాసాయిపేట మండల కేంద్రంగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ గానీ, కనీసం బస్టాప్ గానీ లేకపోవడం ప్రయాణికులకు పెద్ద సమస్యగా మారింది.
44వ జాతీయ రహదారిపై ఉన్న మాసాయిపేట గతంలో వెల్దుర్తి మండలంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. మండల కేంద్రంగా మారిన తర్వాత ప్రజలకు దూరభారం తగ్గినప్పటికీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మండలంలో పోలీస్ స్టేషన్, బస్టాండ్ వంటి కీలక వసతులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్లే 44వ జాతీయ రహదారిపై రోజూ వేల సంఖ్యలో వాహనాలు, వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నప్పటికీ, మాసాయిపేటలో 90 శాతం బస్సులు ఆగడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు.
దీంతో ప్రయాణికులు సమీప గ్రామాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తూప్రాన్‌కు వెళ్లే ప్రయాణికులకు కూడా రామంతపురం నుండి టికెట్ జారీ చేయడం, ఇది మాసాయిపేట స్టాప్ కాదని కండక్టర్లు చెప్పడంతో ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు తెలిపారు.
“మన గ్రామంలో ఒక స్టాప్ కూడా లేకపోవడం బాధాకరం. పెద్ద నాయకులు ఉన్నా సమస్య పరిష్కారం కాలేదని” స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మాసాయిపేటలో బస్టాండ్ ఏర్పాటు చేసి, బస్సుల నిలుపుదల సౌకర్యం కల్పించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








