ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జనం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ పాలుపంచుకున్న గడపగడపకులో ఆయనను జనం నిలదీశారు. తమకు అమ్మ ఒడి రావడం లేదని పలువురు ఆయనకు విన్నవించగా… వారిపై ఆయన చిందులేసిన వైనం వైరల్‌గా మారిపోయింది.
ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ హాజరైన గడపగడపకు కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం వచ్చారు. ఈ సందర్భంగా తమకు అమ్మ ఒడి రావడం లేదని కొందరు ఎమ్మెల్యేకు చెప్పారు. ఆ మాట విన్నంతనే ఉమాశంకర్ గణేశ్ ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడయ్యారు. మీరంతా టీడీపీ కార్యకర్తలని, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచరులు అంటూ చిందులేశారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఘర్షణలో ఓ మహిళపై కూడా వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఆ తర్వాత తనను నిలదీసిన వారి వద్దకు చేతిలో మైక్ పట్టుకుని పరుగులు తీసిన ఎమ్మెల్యే బూతు పురాణం అందుకున్నారు. అవసరమైతే అయ్యన్నను తీసుకురండి అంటూ ఆయన కేకలు వేస్తూ మరీ తిట్ట దండకం వినిపించారు.
గడప గడపకు వైసీపీ రౌడీయిజం చూసారా? నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బూతులు విన్నారా? అమ్మ ఒడి రాలేదు అని ప్రజల్లో కొంతమంది అడగడమే ఈయన కోపానికి కారణం. మీరు తెలుగుదేశం కార్యకర్తలు… అయ్యన్నపాత్రుడి మనుషులు అంటూ తిట్లు అందుకున్నాడు. pic.twitter.com/GVGWCSECLp
— Telugu Desam Party (@JaiTDP) June 7, 2022