contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విశాఖలో పోలీసులు ఆంక్షలు.. పలువురు తెదేపా నేతల గృహనిర్బంధం

విశాఖ: తెదేపా ఆధ్వర్యంలో విశాఖలో తలపెట్టిన పోరుబాటపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రుషికొండలో తవ్వకాలు, అక్రమ కట్టడాలు, దసపల్లా భూములు, పేదల స్థలాల ఆక్రమణ తదితర అంశాలపై తెదేపా నేటి నుంచి ఆరు చోట్ల ఆందోళనలకు శ్రీకారం చుట్టింది.ఈ నేపథ్యంలో గురువారం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పలువురు తెదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు.. శుక్రవారం ఉదయమూ నిర్బంధాలను కొనసాగించారు. పలుచోట్ల ఆ పార్టీ ముఖ్యనేతలను గృహనిర్బంధం చేశారు.
నేడు రుషికొండ పర్యటనకు వెళ్తామని తెదేపా ప్రకటించిన నేపథ్యంలో విశాఖ నగరంలోని పలుచోట్ల పోలీసులు మోహరించారు. తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు పలువురు కార్పొరేటర్లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెదేపా జిల్లా కార్యాలయంతో పాటు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తెదేపా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. పార్టీ కార్యాలయానికి వెళ్తున్న జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతనరెడ్డి, బొట్ట వెంకటరమణను అరెస్ట్‌ చేశారు.

విశాఖ వెళ్తున్న శ్రీకాకుళం జిల్లా తెదేపా అధ్యక్షుడు కూన రవికుమార్, పాలకొండ తెదేపా ఇన్‌ఛార్జ్‌ నిమ్మక జయకృష్ణలను తగరపువలస వద్ద భీమిలి పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. విశాఖ తెదేపా కార్యాలయం వద్ద సుమారు 100 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అవసరమైతే అరెస్టులు చేసేందుకు మూడు వాహనాలను సిద్ధం చేశారు.గురువారం రాత్రి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తన కుటుంబసభ్యులతో సినిమా థియేటర్‌కు వెళ్లినా పోలీసుల ఆంక్షలు తప్పలేదు. ఆమెను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు థియేటర్ వద్దకు వచ్చారు. ఈరోజు ఉదయం విశాఖలో అనిత ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని బయటకు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. పార్టీ కార్యాలయానికి వెళ్తున్న తమను అడ్డుకోవద్దని అనిత కోరారు. పోలీసులు అడ్డుకోవడంతో వాహనం దిగి నడుచుకుంటూ బయల్దేరిన అనిత, సంధ్యారాణిని కొద్దిదూరం అనుసరించిన పోలీసులు.. ఆ తర్వాత బలవంతంగా వాళ్లను అరెస్ట్‌ చేశారు. పోలీసుల తీరుపై అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ పరిరక్షణ కోసం సీఎం జగన్‌ పోలీసులను వినియోగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె మండిపడ్డారు.
రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు చిన్నారులతో వచ్చిన వాళ్లు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల వాహనాలను నిలిపివేయడంతో లగేజీ మోసుకుని నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :