కాకినాడ : కాకినాడ నగరంలోని రామారావుపేట–కొండయ్యపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి రూట్ జంక్షన్ సమీపంలోని చీడీలపోర బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న దివంగత ఇంటి సత్యనారాయణ స్మారక మున్సిపల్ పార్కు నిర్లక్ష్యానికి గురైందని పౌర సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేసిన ఈ పార్కులో మొక్కలు, చెట్లు లేక పచ్చదనం పూర్తిగా కనిపించకుండా పోయిందని పేర్కొంది.
విశాలమైన వాకింగ్ ట్రాక్ ఉన్నప్పటికీ, సందర్శకులకు నీడనిచ్చే ఒక్క చెట్టు కూడా లేకపోవడం బాధాకరమని సంఘం ప్రతినిధులు తెలిపారు. పార్కు ప్రహరీ గోడ చుట్టూ నాలుగు వైపులా కనీసం 500 మొక్కలు నాటే అవకాశం ఉందని, అశోక, యూకలిప్టస్, వేప, కానుగ వంటి పర్యావరణానికి మేలు చేసే మొక్కలను నాటి ప్రత్యేక హరిత ప్రణాళికను అమలు చేయాలని కోరారు.
ఈ మేరకు కార్పొరేషన్ ప్రత్యేక అధికారిని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు, స్థానిక సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులు ఎం.డి. సులేమాన్, ఉయ్యూరి రామనారాయణ, మేళం త్రినాథరావు కలిసి విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా పార్కులో సమగ్ర లైటింగ్ ఏర్పాటు చేసి, పిల్లలు, మహిళలు, యువత కోసం వ్యాయామ, క్రీడా పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో రెండు డివిజన్ల పరిధిలోని సుమారు 26 వేల మంది ప్రజలకు పార్కు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ఆరు అర్బన్ గ్రామాల విలీన సమస్యల కారణంగా గత నాలుగేళ్లుగా మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడంతో రూ.40 కోట్ల ఆర్థిక సంఘం నిధులు అందక, పార్కులు, రోడ్లు వంటి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్ అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు.
నగర అభివృద్ధికి ఎంపీ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ నిధులు కేటాయించి సహకరించాలని వారు కోరారు. అలాగే, కౌన్సిల్ తీర్మానం మేరకు ఈ పార్కుకు దివంగత మాజీ సీనియర్ కౌన్సిలర్ ఇంటి సత్యనారాయణ పేరు పెట్టినందున, పార్కు పేరును స్పష్టంగా తెలియజేసే కార్పొరేషన్ నామఫలకాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పార్కు వద్ద నామఫలకం లేకపోవడం తగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది.








