న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ రాజీనామాను “విద్యార్థుల విజయం”గా అభివర్ణిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం సంబరాలు నిర్వహించింది.
ఈ సందర్భంగా సీజేపీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ, తమ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరిందని పేర్కొంది. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో శాంతియుతంగా పోరాడితే లక్ష్యాలను సాధించవచ్చని ఈ పరిణామం మరోసారి నిరూపించిందని పార్టీ అభిప్రాయపడింది.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, దేశ యువత చేపట్టిన నిరసన ఉద్యమం ఫలించిందని, ఈ విజయం ఒక్క పార్టీది కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరిదని అన్నారు. మంత్రి రాజీనామా వార్త వెలువడగానే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
దేశ యువత శాంతియుతంగా సాగించిన ఉద్యమం వృథా కాలేదని, ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం ఎంత శక్తివంతమో ఈ పరిణామం చాటిచెప్పిందని సీజేపీ నాయకులు పేర్కొన్నారు. తమ ఉద్యమానికి రాజకీయాలతో సంబంధం లేదని, విద్యార్థుల ప్రయోజనాలే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
అయితే తమ డిమాండ్లలో ఒకటి మాత్రమే నెరవేరిందని, మిగిలిన రెండు ప్రధాన డిమాండ్లు కూడా అమలు అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడి చేసిన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వారు, దేశ విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.








