విశాఖపట్నం : దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోయేతర నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఉద్యోగాల కల్పన, వలసల ఆకర్షణలో దేశంలోని ఇతర నాన్-మెట్రో నగరాలను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచినట్లు ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.
నివేదిక ప్రకారం, విశాఖపట్నం తర్వాత పంజాబ్‌లోని లుథియానా, గుజరాత్‌లోని సూరత్, వడోదర, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వరుసగా టాప్-5 స్థానాల్లో నిలిచాయి. ఒకప్పుడు సంప్రదాయ పరిశ్రమలకే పరిమితమైన ఈ నగరాలు ప్రస్తుతం టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, తయారీ, విద్య, మౌలిక సదుపాయాల రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ బహుముఖ ఉద్యోగ కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయని నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ అభివృద్ధి చెందుతున్న నగరాలు ఉద్యోగార్థులకు కొత్త ఆశాకిరణాలుగా మారుతున్నాయని లింక్డ్ఇన్ విశ్లేషించింది. ఈ ఏడాది సుమారు 72 శాతం మంది నిపుణులు కొత్త ఉద్యోగాల కోసం చురుగ్గా ప్రయత్నిస్తుండగా, 76 శాతం మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో నైపుణ్యాల అంతరం పెరగడం, పోటీ తీవ్రతరం కావడం వల్ల ఉద్యోగ వేట మరింత కష్టతరంగా మారిందని అభిప్రాయపడినట్లు నివేదిక వెల్లడించింది.
2022 ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మెట్రో నగరాలకే పరిమితం కాకుండా అభివృద్ధి చెందుతున్న నగరాల్లోనూ మెరుగైన కెరీర్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా లింక్డ్ఇన్ కెరీర్ నిపుణురాలు నీరజితా బెనర్జీ మాట్లాడుతూ, సంప్రదాయ పరిశ్రమలకు టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ఆధునిక రంగాలు జతకావడంతో ఈ నగరాల ఉద్యోగ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందన్నారు. ఉద్యోగార్థులు మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, పెట్టుబడులు పెరుగుతున్న ప్రాంతాలు, తమ నైపుణ్యాలకు అనుగుణమైన పరిశ్రమలను గుర్తించి కెరీర్‌ను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
విశాఖపట్నం పోర్టు, ఫార్మా, తయారీ రంగాల్లో ఇప్పటికే బలమైన స్థానం కలిగి ఉండగా, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, ఐటీ మరియు ఆధునిక సాంకేతిక రంగాల్లో కూడా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలోనే ప్రముఖ ఉద్యోగ కేంద్రంగా ఎదుగుతోందని నివేదిక వివరించింది. అలాగే లుథియానాలో స్టీల్, ఏవియేషన్, సూరత్‌లో స్టార్టప్‌లు, రియల్ ఎస్టేట్, వడోదరలో టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీ మధ్య విశాఖపట్నం వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలు ఉద్యోగార్థులకు కొత్త అవకాశాలను అందిస్తూ భారత ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని లింక్డ్ఇన్ నివేదిక స్పష్టం చేసింది.








