గుంటూరు: భార్యను చంపి రైలు పట్టాలపై మృతదేహాన్ని పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భర్త చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో పురుగులమందు తాగి భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బుధవారం గుంటూరు జిల్లా గురవాయపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. పట్టణంలోని చిత్రాలయ సినిమా హాల్ సమీపాన రైలు పట్టాల వద్ద మహిళ మృతదేహం కనిపించింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతురాలిని మండలంలోని గురవాయపాలెం గ్రామానికి చెందిన పద్మావతి (25)గా గుర్తించారు.ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.మహిళను చంపి రైలు పట్టాలపై పడేసి ఉంటారని పోలీసులు అనుమానించి విచారణ చేపట్టారు.హత్య చేసింది భర్తేనని విచారణలో వెల్లడయ్యింది.భార్య ముఖంపై సుత్తితోమోది రైలు పట్టాలపై మృతదేహాన్ని పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భర్త ప్రయత్నించినట్లు నిర్థారణ అయ్యింది.తన ప్రయత్నం విఫలమయ్యిందని తెలుసుకున్న భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.