ప్రకాశం జిల్లా సంతనూతల పాడు మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సును మండల వ్యవసాయ శాఖ ఆధ్వరంలో నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారిని పి.పావని మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information). సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం (Right to Information Act) భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది. ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 17 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి. సమాచార హక్కు చట్టంలో మెుత్తం 6 అధ్యాయాలు, 31సెక్షన్లు ఉన్నాయని తెలిపారు.
సమాచారం అవసరమైన వారు, సంబంధీత కార్యాలయం ప్రజా సమాచార లేక సహాయ ప్రజా సమాచార అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తెల్ల కాగితంపై రాస్తే చాలు. వ్రాయటం తెలియకపోయినా సమాచారము సక్రమముగా కోరే అవగాహన లేకపోయినా సంబంధిత పౌర సమాచార అధికారి వారు తగిన సహాయము/ఏర్పాటు చేస్తారు. తెల్లకార్డున్న పేదలకు, గ్రామస్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికీ దరఖాస్తు రుసుము లేదు. మండల స్థాయిలో రూ.ఐదు, జిల్లా స్థాయిలో రూ.పదికి మించి రుసుము వసూలు చేయరాదు. అడిగిన సమాచారం ఇవ్వడానికి అయ్యే ఖర్చు మాత్రం దరఖాస్తుదారు నుంచి వసూలు చేయవచ్చు. అడిగిన తరువాత నెల (30 మాత్రము) రోజులు దాటితే ఎంతటి సమాచారమైనా ఉచితంగా ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే రాఘవేంద్ర, జడ్పిటిసి సభ్యురాలు దుంపా రమణమ్మ, ఒంగోలు వ్యవసాయ అధికారిణి వి.వి.శేషమ్మ, ఉద్యానవన శాఖ జిల్లా అధికారిని డి. ప్రత్యూష, వ్యవసాయ విస్తరణ అధికారి సుబ్బారెడ్డి, గ్రామాల వ్యవసాయ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.