పల్నాడు – మాచర్ల: అన్నా–చెల్లెళ్లు, అక్కా–తమ్ముళ్ల మధ్య ఉన్న ఆత్మీయత, అనురాగం, ప్రేమకు ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బ్రహ్మకుమారీ సమాజానికి చెందిన సోదరీమణులు కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ కట్టిన అనంతరం బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనతో ఆధ్యాత్మిక విషయాలపై ముచ్చటించారు. సమాజంలో ప్రేమ, సోదరభావం, శాంతి, మానవతా విలువలను పెంపొందించడంలో రాఖీ పౌర్ణమి సందేశం ఎంతో ప్రాధాన్యత కలిగిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ, ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు బ్రహ్మకుమారీ సంస్థ సోదరీమణులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. సమాజంలో సోదరభావం, మానవతా విలువలు, ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు వారు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
రాఖీ పౌర్ణమి ప్రతి ఒక్కరిలో పరస్పర ప్రేమ, నమ్మకం, ఆప్యాయతలను మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.








