మెదక్ జిల్లా, మాసాయిపేట: యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. మాసాయిపేట మండల పరిధిలోని జాతీయ రహదారి-44పై రైతులు భారీగా బైఠాయించి నిరసన చేపట్టారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందంటూ నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
చుట్టుపక్కల సుమారు 10 గ్రామాలకు చెందిన 300 నుంచి 400 మంది వరకు రైతులు నిరసనలో పాల్గొన్నట్లు సమాచారం. యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నా తమకు సరిపడా ఎరువు అందడం లేదని రైతులు ఆరోపించారు. సాధారణ రైతులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, గిరిజన రైతులకు కూడా యూరియా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ “ఇదేమి ప్రభుత్వం?” అంటూ నినాదాలు చేశారు. యూరియా సరఫరా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రతి రైతుకు అవసరమైన మేరకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళనతో జాతీయ రహదారి-44పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మాసాయిపేట నుంచి చేగుంట వైపు, మాసాయిపేట నుంచి తూప్రాన్ వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రహదారిపై ఇరువైపులా వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ను వెంటనే పునరుద్ధరించడం కష్టంగా మారింది. రైతుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
యూరియా కోసం రైతులు జాతీయ రహదారిపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడటంపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.








