అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకుని చెప్పులు, బూట్లతో ఆందోళన చేపట్టారన్న ఆరోపణలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ ఘటనపై కూటమి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో మాధవరావు సవాల్ విసిరారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో సభలోకి వెళ్లినట్లు ఒక్క ఫొటో లేదా వీడియో చూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.
అయితే వెంటనే స్పందించిన మంత్రి సంధ్యారాణి, వైసీపీ సభ్యులు చెప్పులతో ఉన్న వీడియోను బయటపెట్టినట్లు తెలిపారు.
“స్వామి వారి ఫొటోలను ప్లకార్డుల తరహాలో వాడటం దుర్మార్గం. ఒకరు తలకిందులుగా పట్టుకున్నారు, ఇంకొకరు నిరసన సమయంలో టేబుల్‌పై పడేశారు. వీళ్లకు దేవుడంటే భయం, భక్తి లేవు. దేనికోసం డిమాండ్ చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. వికృత చేష్టలతో స్వామివారిని అవమానించడం కలచివేస్తోంది” అని మంత్రి సంధ్యారాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక మాధవరావు తన పదవికి రాజీనామా చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో శాసనమండలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.








