contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యూట్యూబర్ రావణ్‌కు మావోయిస్టులతో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచలన ఆరోపణలు!

విజయవాడ : వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బత్తుల జోసెఫ్) అరెస్టు వ్యవహారంలో కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలతో గన్నవరం పోలీసులు ఆయనపై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో న్యాయస్థానం ఆయనకు జులై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం, ప్రశ్న రావణ్ మొబైల్ ఫోన్‌లో మావోయిస్టు భావజాలానికి సంబంధించిన సమాచారం లభించినట్లు పేర్కొన్నారు. అలాగే మావోయిస్టు అగ్రనేత హిడ్మాను ప్రశంసిస్తూ ప్రసంగాలు చేసినట్లు, యువత, విద్యార్థులను మావోయిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు.

ఇటీవల ఏలూరులో జరిగిన ఓ దళిత క్రైస్తవ సభలో ఆయన చేసిన ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, వ్యవస్థపై, ప్రజాప్రతినిధులు, పదవుల్లో ఉన్న వ్యక్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హిందూ దేవుళ్లను కించపరచడమే ఆయన ఉద్దేశమని, ‘రావణ్’ అనే పేరును ఉపయోగించడం కూడా అదే భావజాలంలో భాగమని ఆరోపించారు.

గన్నవరం జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 152తో పాటు యూఏపీఏ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. శనివారం రాత్రి ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేసి, ఆదివారం కోర్టులో హాజరుపరిచారు.

ప్రస్తుతం నిందితుడు దర్యాప్తునకు పూర్తిగా సహకరించడం లేదని, ఆయనకు సహకరిస్తున్న వ్యక్తులు, నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

అయితే, ఇవన్నీ ప్రస్తుతం పోలీసుల రిమాండ్ రిపోర్టులో చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై తుది నిర్ధారణ కోర్టు విచారణ అనంతరం జరుగనుంది. తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడా రెచ్చగొట్టే ప్రసంగాల ఆరోపణలపై ప్రశ్న రావణ్‌పై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :