హైదరాబాద్ : తెలంగాణను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా సోమవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో పర్యాటక శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో తారామతి బారాదరిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలని, దుర్గం చెరువును పూర్తిస్థాయి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే మంజీరా, దిల్కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆకర్షణీయంగా మార్చాలని ఆదేశించారు.
టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. అక్కడి వీరభద్రస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ‘క్యూర్’ పరిధిలోని అటవీ భూములను ఎకో టూరిజం ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో మరిన్ని ఎకో పార్కులను ఏర్పాటు చేయాలని, ఫ్యూచర్ సిటీలోని అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా ఆదేశించారు.
హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రక పురానాపూల్ వంతెనను ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అవసరమైతే ఆ ప్రాంతంలోని ట్రాఫిక్‌ను మళ్లించి పర్యాటక జోన్‌గా మార్చే ప్రతిపాదనలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసి దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, పర్యావరణహిత ప్రాజెక్టులు, వారసత్వ కట్టడాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సమావేశంలో అధికారులు వెల్లడించారు.








