హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి తలమానికమైన హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్) పరిధిలో అక్రమ నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలపై అధికారులు అప్రమత్తమయ్యారు. నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్మాణ పనులు చేపడుతోందని ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు సోమవారం సంయుక్తంగా నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల నేతృత్వంలోని బృందం నిర్మాణ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేసింది. నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, పత్రాలు, సాంకేతిక వివరాలను అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు మాట్లాడుతూ, సంబంధిత నిర్మాణానికి తమ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో నిర్మాణానికి సంబంధించిన అన్ని రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్) పరిధిలో జరిగే అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పరిధిలో జరుగుతున్న ఈ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ నగరానికి చారిత్రక, పర్యావరణపరంగా ఎంతో కీలకమైన హుస్సేన్ సాగర్ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, చెరువుల పరిరక్షణకు భంగం కలిగించే ఏ అక్రమ నిర్మాణాన్నీ ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.








