కొమరం భీమ్,ఆసిఫాబాద్ జిల్లా / కాగజ్ నగర్ : పట్టణంలోని ‘ప్రజా లైఫ్ కేర్’ హాస్పిటల్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే పేషెంట్లకు అక్కడ చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. 24 గంటల అత్యవసర సేవలు అందిస్తామని బోర్డులు పెట్టుకున్న ఈ ఆసుపత్రిలో, ఆచరణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
వైద్యుల గైర్హాజరు – సిబ్బంది నిర్లక్ష్యం –
రాత్రి వేళల్లో లేదా తెల్లవారుజామున అత్యవసర పరిస్థితిలో పేషెంట్లు ఆసుపత్రిని సంప్రదిస్తే, అక్కడ కనీసం ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. ఉదయం 9:30 గంటల సమయం దాటినా డాక్టర్లు రాకపోవడం పట్ల బాధితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే, బాధ్యతారహితంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. “డాక్టర్లు లేరు.. తర్వాత రండి” అంటూ రోగులను వెనక్కి పంపిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
హోదాను బట్టి చికిత్స –
ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తనపై మరో తీవ్రమైన ఆరోపణ వినిపిస్తోంది. డబ్బున్న వారికి ఒకలా, మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు మరోలా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, సరైన సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.
పాలకుల అండతోనే అధికారుల మౌనం –
ఈ ఆసుపత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబుకు చెందినది కావడంతో, సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
డిఎంహెచ్ఓ తనిఖీలు చేయడానికి వెనకాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం 24 గంటల సేవలు ఉండాల్సిన చోట, గంటల తరబడి వైద్యులు లేకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రి, ఇలా రాజకీయ పలుకుబడితో నిబంధనలను తుంగలో తొక్కి సామాన్యులను ఇబ్బంది పెట్టడంపై కలెక్టర్ స్పందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.








