contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (52) కన్నుమూశారు. గత ఐదు రోజులుగా గుండెపోటుతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన మృతితో బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ నెల 26న హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో సుదర్శన్‌రెడ్డికి తీవ్ర ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. దాదాపు గంటపాటు వైద్యులు అత్యవసర చికిత్స అందించి, తొమ్మిది సార్లు సీపీఆర్ నిర్వహించిన అనంతరం గుండె స్పందన తిరిగి వచ్చింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

యశోద ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. దీర్ఘకాలం స్పృహలోకి రాకపోవడంతో పాటు నాడీ వ్యవస్థ స్పందించకపోవడం ఆందోళన కలిగించింది. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో మెదడుకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్‌ఐ పరీక్షల్లో వెల్లడైందని వైద్యులు తెలిపారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని సాధారణ రైతు కుటుంబంలో 1974 ఆగస్టు 6న జన్మించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన, 2001లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), ప్రస్తుత బీఆర్ఎస్‌లో చేరారు. అదే ఏడాది నల్లబెల్లి జడ్పీటీసీగా ఎన్నికై ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.

తరువాత 2015లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2018 శాసనసభ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నేతగా ఆయన గుర్తింపు పొందారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతితో తెలంగాణ రాజకీయాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :