టెహ్రాన్/వాషింగ్టన్ : మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా మౌలిక సదుపాయాలు, సైనిక ఆస్తులపై డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. గురువారం జరిగిన ఈ దాడుల్లో అమెరికా సైన్యానికి చెందిన పవర్ జనరేటర్లు, నావిగేషన్ వ్యవస్థలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
అంతకుముందు కువైట్‌లోని అలీ అల్ సేలం వైమానిక స్థావరం, జోర్డాన్‌లోని అల్-అజ్రక్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా సైనిక ఆస్తులపైనా దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. బుధవారం రాత్రి అమెరికా తమపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ స్పష్టం చేసింది.
హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతకు ఇరాన్ నుంచి ముప్పు ఉందని పేర్కొంటూ అమెరికా గతంలో పలు సైనిక చర్యలు చేపట్టింది. దీనికి ప్రతిగా ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు కొనసాగిస్తోందని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉండగా, తమ భూభాగాలను ఉపయోగించి ఇరాన్‌పై ఎలాంటి సైనిక చర్యలకు అమెరికాకు అనుమతి ఇవ్వవద్దని బల్గేరియా, సైప్రస్ దేశాలను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ఆయన టెలిఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.
అయితే, తాము ఇరాన్‌తో ఎలాంటి యుద్ధంలో పాల్గొనబోమని, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన పరిష్కారానికే మద్దతు ఇస్తామని బల్గేరియా, సైప్రస్ స్పష్టం చేశాయి. తాజా పరిణామాలు మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








