హైదరాబాద్ : ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్‌రెడ్డి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, తానొక ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు, పార్టీ శ్రేణులకు, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ విషాద సమయంలో పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డిని కాపాడేందుకు పార్టీ అన్ని విధాలా ప్రయత్నించిందని, వైద్య బృందం కూడా శక్తివంచన లేకుండా చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడం అత్యంత బాధాకరమని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పరిణామం తనకు తీవ్ర మనోవేదన కలిగించిందని తెలిపారు.
తెలంగాణను తన శ్వాసగా భావించి, నీతి నిజాయతీలతో ప్రజా జీవితాన్ని కొనసాగించిన నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు. ఉద్యమాల గడ్డగా పేరుగాంచిన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ జెండాను విజయవంతంగా ఎగురవేసిన ధీర నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలోనే ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిందని గుర్తు చేశారు.
ఉద్యమంలోనూ, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలోనూ పెద్ది సుదర్శన్‌రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కేసీఆర్ అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అత్యంత విధేయతతో పనిచేసిన నాయకుడిగా ఆయనను ప్రశంసించారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాలకు కూడా తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను పార్టీ కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.








