అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఆపరేషన్ వజ్రప్రహార్” కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
గుంతకల్లు సబ్ డివిజన్ పరిధిలోని గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీలో పోలీసులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, విద్యార్థుల హాస్టళ్లు, పీజీ నివాసాలు, చిన్న లాడ్జీలు, ఖాళీ భవనాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి అనుమానాస్పద ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అలాగే పాత గంజాయి, నార్కోటిక్ కేసుల్లో ఉన్న అనుమానితులపై కూడా ప్రత్యేకంగా పరిశీలన చేపట్టారు.
ఈ ఆపరేషన్‌లో ఒక డీఎస్పీ, ముగ్గురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఏడుగురు ఎస్సైలు, ఎనిమిది మంది ఏఎస్ఐలు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 20 మంది కానిస్టేబుళ్లు, ఐదుగురు మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 86 ఇళ్లలో సోదాలు నిర్వహించి 125 మంది వ్యక్తులను తనిఖీ చేశారు.
రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను స్పాట్‌కు పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసులు సూచించారు.
ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు వివరించారు.
ప్రజలు తమ ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
అదేవిధంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలతో కలిసి ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ నిర్వహించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గుత్తి అర్బన్ సీఐ రామారావు, ఎస్సైలు సురేష్, అమీర్ ఖాన్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, హనుమంతు, కానిస్టేబుళ్లు సురేంద్ర, షబ్బీర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.








