మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చెగుంట మండలంలో అక్రమంగా నిల్వ ఉంచి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చెగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటళ్లు, దాబాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా చెగుంట పట్టణ కేంద్రంలోని శ్రీ కృష్ణ గ్రాండ్ హోటల్ వద్ద 3, సమ్మర్ ప్రీతీ షేర్ పంజాబీ ఫ్యామిలీ దాబా వద్ద 4, తెలంగాణ ఫ్యామిలీ దాబా వద్ద 3, అలాగే మక్కారాజ్పేట్ వై జంక్షన్ దాబా వద్ద 5 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12 సిలిండర్లు అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
చేగుంట పట్టణంలో ప్రైవేట్ కంపెనీలు ఉండటంతో పెద్ద సంఖ్యలో కార్మికులు రావడం వల్ల గ్యాస్ డిమాండ్ పెరిగిందని, కొందరు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మరియు రీఫిల్లింగ్ నిర్వాహకులు డొమెస్టిక్ సిలిండర్లను అధిక ధరలకు హోటళ్లకు అక్రమంగా సరఫరా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులచే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ మండలంలో గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్ల కొరత లేదని తెలిపారు. అవసరమైన సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ తనిఖీల్లో ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జైభరత్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.








