తిరుపతి జిల్లా, పాకాల : పొట్టి శ్రీరాములు జన్మదినం సందర్భంగా పాకాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సంతోష్ సాయి అధ్యక్షత వహించి కార్యాలయ సిబ్బందితో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంతోష్ సాయి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలిపారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే లక్ష్యంతో ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం ఆయన చేసిన ఉద్యమం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిందని అన్నారు. గాంధేయవాదిగా స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొని అనేక కష్టాలను ఎదుర్కొన్న మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. దేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలు శిక్షలు అనుభవించిన ఆయన త్యాగస్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ఆయన చేసిన మహాత్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది పొట్టి శ్రీరాములు సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని సంకల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.








