తిరుపతి : రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ నాయకుల అరెస్టుల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ మునితుకారాం, ఆయన సన్నిహిత అనుచరుడు వి. మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు.
చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా వద్ద మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాయకులతో కలిసి కాఫీ తాగేందుకు వచ్చిన సమయంలో సిఐడి పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ అరెస్టులు జరిగినట్లు సమాచారం.
అనంతరం మునితుకారాం, మాధవరెడ్డిని తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు. మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఫైల్ దగ్ధం కేసులో వీరు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, తమపై అన్యాయంగా కేసులు నమోదు చేసి అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను ఖండిస్తూ, భవిష్యత్తులో దీనికి తగిన ప్రతిఫలం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఈ అరెస్టులతో తిరుపతి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పోలీసు బందోబస్తు కూడా పెంచినట్లు సమాచారం.








