contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాగజ్‌నగర్‌లో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ అవగాహన కార్యక్రమం

కుమురం భీమ్ ఆసిఫాబాద్ : డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాలు దాలుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ ఎస్పీఎం హెచ్‌ఆర్‌డీ భవనంలో నిర్వహించిన “సైబర్ జాగృత దివాస్ – సురక్షకా తిరంగా” అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశతో వచ్చే ఆన్‌లైన్ పెట్టుబడి ఆఫర్లు, లాటరీలు, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోవద్దని ఎస్పీ హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులు, APK ఫైళ్లను ఓపెన్ చేయకూడదని, వాటి ద్వారా మొబైల్ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు దొంగిలించే అవకాశం ఉంటుందని వివరించారు.

ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్కు ఫిర్యాదు చేయడంతో పాటు సమీప పోలీసు స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదిస్తే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు.

సైబర్ నేరాలపై అవగాహనే ప్రధాన ఆయుధమని పేర్కొన్న ఎస్పీ, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు సైబర్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, టౌన్ సీఐ ప్రేమ్‌కుమార్, రూరల్ సీఐ కుమారస్వామి, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐలు దివ్య, కిరణ్, ఎస్‌ఐలు రాజు, లక్ష్మణ్, నరేష్, ఇతర పోలీసు అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది, విద్యార్థులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :