contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. అవగాహనే ప్రధాన ఆయుధం: ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో “సైబర్ జాగృతిక దివాస్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలపై సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ముఖ్య అతిథులుగా హాజరై సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.

కార్యక్రమంలో ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, క్రెడిట్ కార్డ్ మోసాలు, ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలు, అపరిచితుల వీడియో కాల్స్ ద్వారా జరిగే మోసాలు వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. అలాగే ఆన్‌లైన్‌లో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలను ఉదాహరణలతో తెలియజేశారు.

సైబర్ మోసాలకు గురైనప్పుడు వెంటనే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని, త్వరితగతిన స్పందిస్తే నష్టాన్ని కొంతవరకు నివారించే అవకాశం ఉంటుందని అధికారులు సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాతో గడుపుతున్నారని, అదే విషయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. మొబైల్ ఫోన్‌ను మంచి పనులకే ఉపయోగించుకోవాలని, చెడు అలవాట్లు మరియు అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, సైబర్ నేరగాళ్లు బాధితులను ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేకుండానే విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ మోసాలు జరిగిన తర్వాత నిందితులను గుర్తించడం, పట్టుకోవడం చాలా కష్టమని, అందువల్ల ముందస్తు జాగ్రత్తలే ఉత్తమ రక్షణ అని పేర్కొన్నారు.

సైబర్ నేరగాళ్లు ప్రజల భావోద్వేగాలు, భయాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తారని, తక్కువ సమయంలో మూడు, నాలుగు రెట్లు లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడి పథకాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం పెట్టుకోవద్దని హెచ్చరించారు. “కష్టపడితేనే సంపాదన వస్తుంది.. సులభంగా అధిక లాభాలు వస్తాయనే మాటలను నమ్మవద్దు” అని విద్యార్థులకు సూచించారు.

అవగాహనతోనే సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని, ప్రతి విద్యార్థి తాను తెలుసుకున్న సమాచారాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ రాములు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ కళా బృందం సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :