పార్వతీపురం : ప్రభుత్వ నిధులతో పాటు ప్రజల భాగస్వామ్యం, స్థానిక నాయకుల సహకారంతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే ‘పీహెచ్సీ ముస్తాబు’ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు.
బుధవారం జీయ్యమ్మవలస మండలం ఆర్.ఆర్.బి పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ప్రాంగణంలో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో ముస్తాబు కార్యక్రమం, జాతీయ ఆరోగ్య పథకాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.బి పురం పీహెచ్సీ జిల్లాలోనే తొలి ముస్తాబు కేంద్రంగా నిలవడం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు.
ఆరోగ్య కేంద్రాలు దేవాలయాల్లాంటివి
ఆసుపత్రులు కేవలం వైద్య సేవలు అందించే స్థలాలు మాత్రమే కాకుండా, రోగులకు ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణం కల్పించే ప్రదేశాలుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. పీహెచ్సీ ఆవరణను అందంగా తీర్చిదిద్దిన వైద్యులు సుస్మిత, దిలీప్లను ప్రత్యేకంగా అభినందించారు. ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు, కంచె, కూర్చునే సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల అది ఉద్యానవనంలా మారిందని ప్రశంసించారు.
జిల్లా మొత్తం ముస్తాబు దిశగా
ఆర్.ఆర్.బి పురం పీహెచ్సీని ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇదే విధంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, స్థానిక దాతలు, నాయకుల సహకారంతో మౌలిక వసతులు మెరుగుపరచాలని సూచించారు.
విద్యార్థులకు అవగాహన – సేవల విస్తరణ
ప్రతి పీహెచ్సీ పరిధిలోని పాఠశాల విద్యార్థులను నెలకు ఒకసారి ఆసుపత్రులకు ఆహ్వానించి, ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత, సేవల నాణ్యతపై ప్రత్యేక చెక్లిస్ట్ అమలు చేయాలని, రోగుల పట్ల వైద్య సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయిలో
స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ, ముస్తాబు కార్యక్రమంతో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. పీహెచ్సీల్లో పరిశుభ్రత, పచ్చదనం, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో గుర్తింపు
జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కలెక్టర్ నేతృత్వంలో అమలవుతున్న అభివృద్ధి నమూనాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని, నీతి ఆయోగ్ మేగజైన్లో ప్రచురితమవడం గర్వకారణమని తెలిపారు. ముస్తాబు కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. భాస్కరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి. కొండలరావు, వైద్యశాఖ అధికారులు, పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








