దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులను కవర్ చేస్తున్న జర్నలిస్టులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఘటన గురువారం చోటుచేసుకుంది. రష్యా టుడే (ఆర్టీ) ఛానెల్‌కు చెందిన రిపోర్టర్ స్టీవ్ స్వీనీ, కెమెరా ఆపరేటర్ అలీ రిదా స్బైటీ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో వారికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో క్షిపణి పేలడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే, దక్షిణ లెబనాన్‌లోని లిటాని నదిపై ఉన్న అల్-ఖస్మియా వంతెన సమీపంలో ఈ ఇద్దరు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడులను ప్రత్యక్షంగా కవర్ చేస్తున్నారు. వారు ప్రెస్ అని స్పష్టంగా గుర్తించే జాకెట్లను ధరించి ఉండగా, అకస్మాత్తుగా ఓ క్షిపణి పెద్ద శబ్దంతో వారి సమీపంలో పేలింది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన దాడి కాదని, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు. గాయపడిన కెమెరామెన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఈ దాడిని ధృవీకరించింది. అల్-ఖస్మియా వంతెనను ఆయుధాల రవాణాకు ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ, ఆ కారణంగానే దాడులు నిర్వహించామని తెలిపింది. ముందుగానే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పౌరులకు హెచ్చరికలు జారీ చేశామని, తమ దాడులు పౌరులు లేదా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని కావని స్పష్టం చేసింది.
ఈ ఘటనపై జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ (సీపీజే) స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.








