కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఈద్గా మైదానంలో శనివారం రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక నమాజ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొని, అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తూ క్రమశిక్షణతో, ఆత్మశుద్ధితో ప్రార్థనలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. రంజాన్ పండుగ సమాజంలో శాంతి, సౌహార్దం, సోదరభావాన్ని పెంపొందించే మహత్తర పండుగ అని అన్నారు.
మన ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా ఐక్యంగా, శాంతియుత వాతావరణంలో జీవించాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర పర్వదినం ముస్లిం సోదరులందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
నమాజ్ అనంతరం ఎమ్మెల్సీ ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని “ఈద్ ముబారక్” అంటూ అభినందనలు తెలియజేస్తూ వారితో కలిసి సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.








