చిన్నగొట్టిగల్లు/తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు – రొంపిచెర్ల సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన పార్టీ నేతలతో కలిసి అక్రమ మైనింగ్ జరుగుతున్న క్వారీ ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా క్వారీలో నిల్వ ఉంచిన గ్రానైట్ బండలను మీడియాకు చూపిస్తూ, స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నానిపై హర్షిత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కనుసన్నల్లోనే ఈ భారీ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటివరకు సుమారు రూ.100 కోట్ల విలువైన గ్రానైట్ అక్రమంగా తరలించారని, మరో రూ.70 కోట్ల విలువైన మెటీరియల్ రవాణాకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
టీడీపీకి చెందిన వ్యక్తిని ముందుకు పెట్టి, ఎటువంటి మైనింగ్ లేదా రెవెన్యూ అనుమతులు లేకుండా ఈ దోపిడీ కొనసాగుతోందని ఆయన విమర్శించారు. దొంగ వే-బిల్లులతో యథేచ్ఛగా గ్రానైట్ తరలింపులు జరుగుతున్నప్పటికీ పోలీసులు, మైనింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
హర్షిత్ రెడ్డి మీడియాతో కలిసి క్వారీ వద్దకు వస్తున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే అక్కడ పనిచేస్తున్న యంత్రాలు, కార్మికులు, సంబంధిత నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
“అక్రమ మైనింగ్‌ను వెంటనే ఆపకపోతే కలెక్టరేట్ ముట్టడికి వెనుకాడం. అక్రమంగా రవాణా చేసే లారీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం,” అని హర్షిత్ రెడ్డి హెచ్చరించారు. అక్రమ క్వారీ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, లేకపోతే తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపడతామని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో హర్షిత్ రెడ్డితో పాటు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సహదేవరెడ్డి, ఎంపీపీ యుగంధర్ రెడ్డి, చిన్నగొట్టిగల్లు మండల పార్టీ అధ్యక్షుడు సింహాల మోహన్, అలాగే పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.









