అనంతపురం జిల్లా – గుంతకల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, గుంతకల్లు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షురాలు వై. నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గుంతకల్లు పట్టణంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
వైవీఆర్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పొట్టి శ్రీరాములు సర్కిల్ మీదుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వేలాది మంది పార్టీ శ్రేణులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలు పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నైరుతి రెడ్డి మాట్లాడుతూ, అబద్ధపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రాష్ట్ర ప్రజల ఆశలను వమ్ము చేసిందని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అందడం లేదని, రైతులకు భరోసా లేకుండా పోయిందని, మహిళలకు రక్షణ, విద్యార్థులకు భవిష్యత్తు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
మెగా డీఎస్సీ పేరుతో యువతను నమ్మించి చివరకు నిరాశకు గురిచేసిందని, కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధానాలను ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శించారు. వైఎస్ జగన్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలపై ధరల భారం, పన్నుల భారం మోపిందని అన్నారు.
రైతులు, యువత, మహిళలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రచారాలకే పరిమితమై ప్రజా సమస్యలను విస్మరించిందని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ప్రజల పక్షాన పోరాడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ప్రజా సమస్యలపై ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని నైరుతి రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు, గుత్తి, పామిడి పట్టణ, మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, వైఎస్ జగన్, వైవీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.








