చేగుంట – తూప్రాన్ డివిజన్ : రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్యాడీ ప్రోక్యూర్‌మెంట్ సెంటర్ల (PPCs) వద్ద నెలకొన్న లారీల కొరత సమస్య పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు శుక్రవారం ఎంవీఐ శ్రీనివాస్, తహసీల్దార్ శివప్రసాద్ ఆధ్వర్యంలో చేగుంట రెవెన్యూ సిబ్బంది, ట్రాన్స్‌పోర్ట్ శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా రోడ్లపైకి వచ్చి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్న లారీలను ఆపి వాటిని ప్యాడీ ప్రోక్యూర్‌మెంట్ సెంటర్లకు మళ్లిస్తూ ధాన్యం రవాణా ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అధికారుల సమన్వయంతో చేపట్టిన ఈ చర్యల ఫలితంగా వడ్ల కొనుగోలు ప్రక్రియకు ఊపు అందుకుందని, రైతులకు గణనీయమైన ఊరట కలుగుతోందని అధికారులు తెలిపారు.
ధాన్యం నిల్వలు పెరిగిపోవడం, లారీల కొరత కారణంగా ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సూచనల మేరకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.








