రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన సంక్షోభం కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరత పూర్తిగా పరిష్కారమయ్యే వరకు భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. విమానాశ్రయ నిర్మాణం కంటే ప్రజల దైనందిన అవసరాలకు ఇంధనం అందుబాటులో ఉండటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత కావాలని స్పష్టం చేశారు. అలాగే విశాఖపట్నం ఎయిర్‌పోర్టును యథాతథంగా కొనసాగించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.
డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణతో పాటు ఇంధన ఆదా దృష్ట్యా డీజిల్ బస్సుల స్థానంలో పెద్దఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాలకు కొత్తగా వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రైలు సర్వీసులు పెరగడం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి, ఇంధనంపై భారం కూడా తగ్గుతుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు.








