పాము అంటేనే భయంతో పరుగులు తీసే ఈ రోజుల్లో మహారాష్ట్రలోని ఒక గ్రామం మాత్రం విషసర్పాలతో సహజీవనం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న షేట్ఫల్ గ్రామం నాగుపాములతో గ్రామస్తుల అనుబంధానికి ప్రసిద్ధి చెందింది.
ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ‘దేవస్థానం’ పేరుతో పాములు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయడం విశేషం. నాగుపాములు గ్రామంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఇళ్లలోకి, పాఠశాలల్లోకి, దేవాలయాల్లోకి వస్తూ పోతుంటాయి. అయినప్పటికీ గ్రామస్తులు వాటిని ఎలాంటి హానీ చేయకుండా దైవస్వరూపాలుగా భావించి గౌరవిస్తారు.
గ్రామస్థుల మాటల్లో చెప్పాలంటే.. ఎన్నేళ్లుగా విషసర్పాలతో కలిసి జీవిస్తున్నప్పటికీ పాముకాటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరిగాయని చెబుతున్నారు. మనుషులు, పాముల మధ్య ఉన్న పరస్పర గౌరవం, సహజీవనమే ఇందుకు కారణమని వారు విశ్వసిస్తున్నారు.
ఇక్కడ చిన్నపిల్లలు కూడా నాగుపాములతో భయపడకుండా ఆడుకోవడం పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. షేట్ఫల్ గ్రామంలో ప్రధానంగా నాగుపాములు ఎక్కువగా కనిపిస్తాయి. వీటితో పాటు జెర్రిపోతులు, కట్లపాములు, పచ్చపాములు, నీటి పాములు కూడా దర్శనమిస్తుంటాయి. అప్పుడప్పుడు కొండచిలువలు కూడా గ్రామంలో కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రత్యేక సంప్రదాయం, ప్రకృతితో మనుషుల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ గ్రామాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. షేట్ఫల్ గ్రామం పూణేకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉండగా, సమీపంలో సోలాపూర్ రైల్వే స్టేషన్ ఉంది. పూణే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టాక్సీల ద్వారా ఈ గ్రామానికి చేరుకోవచ్చు.








