నిజామాబాద్ : ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్‌లో తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినట్లు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డా. నాగ మోహన్ రావు తెలిపారు. గుండె వైద్య సేవల్లో ఇది కీలక మైలురాయిగా నిలిచిందన్నారు.
సింకోపల్ అటాక్స్‌తో బాధపడుతున్న శ్రీ యాదయ్యకు శనివారం ఉదయం యాంజియోగ్రామ్ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. కార్డియాలజీ విభాగం వైద్యులు, సిబ్బంది సమిష్టి కృషితో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక గుండె వైద్య సేవలను బలోపేతం చేసే దిశగా ఇది ముఖ్యమైన ముందడుగని డా. నాగ మోహన్ రావు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ఈ విజయంతో జిల్లా ప్రజలకు ప్రభుత్వాసుపత్రిలోనే నాణ్యమైన గుండె వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని వైద్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.








