contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బేగంపేట గ్రామం – పెద్దమ్మ తల్లి ఆలయం లో చోరీ

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. ఆలయం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు అమ్మవారి బంగారు ఆభరణాలతో పాటు నగదును అపహరించినట్లు ఆలయ కమిటీ, స్థానికులు తెలిపారు.

స్థానికుల వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ ముఖద్వారం తాళాలను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. అమ్మవారి విగ్రహంపై ఉన్న సుమారు అర్ధ తులం బరువున్న రెండు బంగారు ముక్కుపుడకలు, మరో అర్ధ తులం బరువున్న రెండు బంగారు పుస్తెలను ఎత్తుకెళ్లినట్లు ముదిరాజ్ కులస్తులు తెలిపారు.

అదే సమయంలో ఆలయంలోని అర్చకుడికి సంబంధించిన బీరువాలో ఉన్న రూ.6,500 నగదు, అమ్మవారి హుండీలో ఉన్న సుమారు రూ.5,000 నగదును కూడా దొంగలు అపహరించినట్లు తెలిపారు.

ఉదయం ఆలయానికి వెళ్లడంతో వెలుగులోకి..

ఆదివారం ఉదయం సుమారు 6 గంటలకు ఎప్పటిలాగే ఆలయాన్ని శుభ్రం చేసేందుకు ఓ మహిళ అక్కడికి వెళ్లింది. ఆలయ తలుపులు తెరిచి ఉండటంతో పాటు, ప్రాంగణంలో వస్తువులు చిందరవందరగా కనిపించడంతో వెంటనే ఆలయ చైర్మన్ రవికి సమాచారం అందించింది.

ఘటనాస్థలికి చేరుకున్న చైర్మన్ ఆలయాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రామగిరి ఎస్‌ఐ తాడవేన శ్రీనివాస్, మంథని సీఐ స్వామి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు.

సీసీ కెమెరాలు ఆఫ్ చేసిన దుండగులు?

చోరీకి ముందు ఆలయంలోని సీసీ కెమెరాలను దుండగులు ఆఫ్ చేసి ఉండవచ్చని గ్రామస్థులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10:20 గంటల వరకు సీసీ కెమెరాలు పనిచేసిన దృశ్యాలు రికార్డైనట్లు గ్రామస్థులు తెలిపారు. అనంతరం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కెమెరాలు పనిచేయలేదని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

దీంతో చోరీకి పాల్పడిన వ్యక్తులు సీసీ కెమెరాల వ్యవస్థపై అవగాహన ఉన్నవారేనా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం

ఆలయ చైర్మన్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ జరిగిన తీరును పరిశీలిస్తూ, సీసీ కెమెరాల రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఆలయంలో భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేసి, అపహరించిన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :