contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలు అలర్ట్‌గా ఉండాలి : పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం

కరీంనగర్: కరీంనగర్ నగరంలో ఇటీవల పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ దోపిడీ ఘటన నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహకులతో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ సమావేశంలో భద్రతా చర్యలు, నిఘా వ్యవస్థలపై కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఆయుధాలతో కూడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ఫోన్ నంబర్లు, తప్పుడు చిరునామాలతో నగరంలోని పలు హోటళ్లలో దాదాపు రెండు నెలల పాటు బస చేస్తూ రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం కఠినమైన మార్గదర్శకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలకు పలు కీలక సూచనలు చేస్తూ, రూములు కేటాయించే ముందు ప్రభుత్వ గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆధార్ కార్డులలోని ఫోటో, చిరునామా, ఇతర వివరాలను ధృవీకరించడంతో పాటు అవసరమైతే అదనపు గుర్తింపు పత్రాలు కూడా తీసుకోవాలని తెలిపారు. కస్టమర్లు ఇచ్చే మొబైల్ నంబర్లు యాక్టివ్‌లో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని, విదేశీయుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.

ప్రతి హోటల్‌లో హై రెజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కనీసం 90 రోజుల ఫుటేజీ భద్రపరచాలని సీపీ ఆదేశించారు. గెస్ట్ రిజిస్టర్, ఐడీ ప్రూఫ్‌లు, వాహనాల వివరాలు, చెక్-ఇన్, చెక్-అవుట్ సమయాలను డిజిటల్ రూపంలో నిర్వహించాలని తెలిపారు.

అలాగే అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. లగేజీ లేకుండా గదులు తీసుకునేవారు, సీసీ కెమెరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే వారు, భారీ నగదు లావాదేవీలు చేసే వారిపై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

నిబంధనలు ఉల్లంఘించి నిందితులకు ఆశ్రయం కల్పించినా, పోలీసుల తనిఖీలకు సహకరించకపోయినా సంబంధిత హోటల్ యాజమాన్యాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

అంతర్రాష్ట్ర నేరగాళ్ల కదలికలను అణచివేయడానికి నగరంలో విస్తృత నిఘా, తనిఖీ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, సరిహద్దు ప్రాంతాల్లో పగలు-రాత్రి తేడా లేకుండా నాకాబందీ నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నామని చెప్పారు.

సమస్యాత్మక ప్రాంతాలు, శివారు కాలనీలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు చేపడుతూ కొత్తగా అద్దెకు దిగినవారు, అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్థుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, జ్యువెలరీ షాపులు, ఫైనాన్స్ సంస్థల వద్ద బ్లూ కోల్ట్స్, టాస్క్‌ఫోర్స్, ప్రత్యేక పోలీస్ బలగాలతో నిరంతర పెట్రోలింగ్ పెంచినట్లు వెల్లడించారు.

ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తమ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, వింత ప్రవర్తన చేసే కొత్త అద్దెకారులు, అనాథగా వదిలిన వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, తిరుమల్‌తో పాటు స్థానిక హోటళ్లు, లాడ్జీల యజమానులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :