కరీంనగర్: రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ సోమవారం కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కరీంనగర్ రూరల్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం చింతకుంట, గంగాధర మండలం తుర్కాసినగర్, చొప్పదండి మండలంలోని ఆర్నకొండ వద్ద ఏర్పాటు చేసిన అంతర్‌జిల్లా చెక్‌పోస్టులను సీపీ స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
తనిఖీల సందర్భంగా చెక్‌పోస్టుల గుండా వెళ్లే ప్రతి అనుమానాస్పద వాహనాన్ని, ముఖ్యంగా రవాణా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. చట్టవ్యతిరేకంగా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చెక్‌పోస్టుల్లో నిర్వహిస్తున్న తనిఖీ రిజిస్టర్‌లను పరిశీలించిన సీపీ, ప్రతి వాహనం వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, నిరంతర నిఘా కొనసాగించేలా సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.
విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి కల్పించిన మౌలిక వసతులను కూడా సీపీ పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ గౌష్ ఆలం స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో సీపీ వెంట ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, రూరల్ ఏసీపీ విజయకుమార్, ఇన్స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్, ప్రదీప్ కుమార్, ఎస్సైలు సాంబమూర్తి, వంశీకృష్ణ, నరేష్ రెడ్డి తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








